NewsTelugu News
ఆర్మీకి సెలక్ట్ అయిన యువకుడు.. నిండా ముంచిన ప్రేమ, చివరికి ఏం అయిందో తెలిస్తే షాక్ అవుతారు.
ప్రేమించిన అమ్మాయికి పెళ్లిచేసేందుకు ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారని తెలియడంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజాం మండలంలో శనివారం చోటు చేసుకుంది.
- శ్రీకాకుళం జిల్లాలో విషాదం
- ప్రియురాలికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని యువకుడి బాధ
- పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువకుడు
తాను ప్రేమించిన అమ్మాయికి మరో అబ్బాయితో పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారని తెలియడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలో శనివారం చోటు చేసుకుంది. పొందూరు మండలం జాడపేట(మలకాం) గ్రామానికి చెందిన మల్లిపెద్ది నవీన్ (22) ఇంటర్ పూర్తిచేసి ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. రాజాం మండలానికి చెందిన ఓ యువతిని ప్రేమించి ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
అయితే ఆ యువతికి తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న నవీన్ శనివారం ఆమె గ్రామానికి వెళ్లి ఆరా తీశాడు. ప్రియురాలు తనకు దక్కదన్న మనోవేదనతో వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేశాడు. అదే గ్రామంలో నివాసముండే నవీన్ మేనత్త రమణమ్మకు ఈ విషయం తెలియటంతో వెంటనే నవీన్ తండ్రి శంకరరావుకు సమాచారం ఇచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు అతడిని రాజాం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అది కొవిడ్ ఆసుపత్రి కావటంతో రాజాంలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా చనిపోయాడు. చేతికి అందొచ్చిన కొడుకు కళ్లెదుటే మృతి చెందటంతో తండ్రి శంకరరావు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై రాజాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.