Telugu News

అడ్డొచ్చిన పోలీస్ చేతిని నరికిన దుండగుడు

కరోనా లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తున్న క్రమంలో పంజాబ్‌లో పోలీసులపై దాడి జరిగింది. కారులో వచ్చిన ఓ వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బారికేడ్లను ఢీకొట్టి ముందుకు కదిలారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని ప్రశ్నించడంతో కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి ఏఎస్‌ఐ హర్జీత్‌ సింగ్‌పై తల్వార్‌తో దాడి చేశాడు. దీంతో అతని చేయి తెగిపడింది. మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటన పటియాల జిల్లాలోని ఓ కూరగాయల మార్కెట్‌ వద్ద ఆదివారం ఉదయం ఆరు గంటలకు చోటుచేసుకుంది. ఘటనలో ప్రమేయం ఉన్న ముగ్గురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించామని, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు.

తీవ్రంగా గాయపడిన హర్జీత్‌ సింగ్‌ను చంఢీగర్‌లోని పీజీఐ ఆస్పత్రికి తరలించామని పంజాబ్‌ డీజీపీ దినకర్‌ గుప్తా తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా, కోవిడ్‌-19 నియంత్రణకు మే 1 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, దేశంలో లాక్‌డౌన్ పొడిగించిన రెండో రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. దీనిక‌న్నా ముందు ఒడిశా ప్ర‌భుత్వం ఏప్రిల్ నెలాఖ‌రు వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగించింది. ఇక పంజాబ్‌ 151 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా.. 11 మంది మరణించారు. ఐదుగురు కోలుకున్నారు.

Source: Sakshi

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close