Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 29/11/2019

జాతీయం :

¤ లోక్‌పాల్‌ కోసం అలహాబాద్‌కు చెందిన ప్రశాంత్‌ మిశ్రా రూపొందించిన లోగోను ఎంపిక చేశారు. ఉపనిషత్తు నుంచి ‘పరుల సొమ్ము ఆశించమాకు’ అనే అర్థం వచ్చే శ్లోకాన్ని నినాదంగా ఎంచుకున్నారు.
¤ 70వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రాజ్యసభ 250వ సమావేశాన్ని పురస్కరించుకుని రూ.250 విలువైన వెండి నాణెం, రూ.5 ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేశారు. ‘భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యసభ పాత్ర’ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
¤ 70వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా సుప్రీంకోర్టులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ. బోబ్డే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. తీర్పులను తొమ్మిది భారతీయ భాషల్లోకి అనువదించే సువాస్‌ (సుప్రీంకోర్టు విధిక్‌ అనువాద్‌ సాఫ్ట్‌వేర్‌) యాప్‌ను అత్యున్నత న్యాయస్థానం అందుబాటులోకి తెచ్చింది.
¤ కేంద్రపాలిత ప్రాంతాలైన దమణ్‌దీవ్, దాద్రానగర్‌ హవేలీలను విలీనం చేయడానికి ఉద్దేశించిన బిల్లును కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
¤ గత ఏడాది కాలంలో దేశంలో అవినీతి 10% తగ్గిందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ఇండియా (టీఐఐ), లోకల్‌ సర్కిల్స్‌ సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అవినీతి సూచీలో 2018తో పోలిస్తే భారతదేశ ర్యాంకింగ్‌ మూడుస్థానాలు మెరుగుపడింది. 180 దేశాల్లో 78వ స్థానంలో నిలిచింది.
¤ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. అనూహ్య పరిణామాల మధ్య ఫడణవీస్‌ నవంబరు 23న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గేందుకు అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో నాలుగు రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 

  » మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా భాజపా సీనియర్‌ ఎమ్మెల్యే కాళిదాస్‌ కొలంబకర్‌తో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు.
¤ భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 2019 నవంబరు 26 నాటికి 70 ఏళ్లు అవుతున్న సందర్భంగా పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు.

అంతర్జాతీయం :

¤ ప్రపంచవ్యాప్తంగా 11-17 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో 80 శాతం కంటే ఎక్కువమంది రోజుకు కనీసం గంటసేపు కూడా వ్యాయామం చేయడం లేదని, ఫలితంగా మేధో వికాసంపై ప్రతికూల ప్రభావం పడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం 2016 నాటికి ప్రపంచవ్యాప్తంగా 146 దేశాల్లో ఉన్న పరిస్థితులను వివరించింది. మన దేశంలో 72% మంది బాలురు రోజులో కనీసం గంట కూడా శారీరక శ్రమ చేయట్లేదు. ప్రపంచ సగటు (78%)తో పోలిస్తే ఇది కాస్త మెరుగు.

రాష్ట్రీయం :

రాష్ట్రీయం (ఆంధ్రప్రదేశ్‌)

¤ అవినీతిపై ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరించేందుకు ప్రత్యేక కాల్‌ సెంటర్‌ నంబరు 14400ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో దీన్ని ప్రారంభించారు.

రాష్ట్రీయం (తెలంగాణ)

¤ సమస్యల పరిష్కారం కోసం 52 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు దాన్ని విరమించి, విధులకు హాజరు కావాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఇంత సుదీర్ఘకాలం సమ్మె చేయడం ఇదే తొలిసారి. అక్టోబరు 5న ప్రారంభమైన సమ్మె 52 రోజులపాటు సాగింది. 2001లో 24 రోజులపాటు సమ్మె చేశారు. 2015లో 8 రోజులు చేపట్టారు. తెలంగాణ సాధన కోసం 2011లో చేపట్టిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు 26 రోజులు పాల్గొన్నారు.
¤ జాతీయ ఆహార భద్రతా మిషన్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) పథకం అమలు కోసం వ్యవసాయ శాఖ రూ.51.65 కోట్లు విడుదల చేసింది. వరి, పప్పుధాన్యాల పంటలు పండించే రైతులకు రాయితీలు ఇచ్చేందుకు ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో తొలుత రూ.12.66 కోట్లు కేటాయించారు. అవి సరిపోవని వ్యవసాయశాఖ తెలపడంతో అదనంగా రూ.51.65 కోట్లను ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

ఆర్థిక రంగం :

¤ ప్రముఖ ఎల్రక్టానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ యాపిల్‌ భారత్‌లో ఐఫోన్‌ శ్రీళి మోడల్‌ తయారీని ప్రారంభించిందని, కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. దేశీయ అమ్మకాలతో పాటు ఎగుమతులు కూడా ఇక్కడి నుంచే జరుగుతాయని పేర్కొన్నారు.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ :

¤ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ 47 ప్రయోగం విజయవంతమైంది. దీని ద్వారా 14 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. పీఎస్‌ఎల్‌వీ సంకేతాలను అంటార్కిటికాలోని ఇస్రో కేంద్రం అందుకుంది. చంద్రయాన్‌-2 తర్వాత ఇస్రో చేపట్టిన ఈ తొలి ప్రయోగంలో కార్టోశాట్‌-3తోపాటు అమెరికాకు చెందిన 13 నానో ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. కార్టోశాట్‌-3 మూడోతరం హైరిజల్యూషన్‌ ఎర్త్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం. దీని జీవిత కాలం అయిదేళ్లు. బరువు సుమారు 1625 కిలోలు. ఇది పట్టణాభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ వనరులకు సంబంధించిన సేవలను అందించనుంది. ఉగ్రవాద శిబిరాల చిత్రాలను మరింత స్పష్టంగా తీస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close