Current Affairs
Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 29/12/2019
ఆర్‌బీఐ 25వ ఆర్థిక స్థిరత్వ నివేదిక విడుదల
దేశ ఆర్థిక అంశాలపై రూపొందించిన ‘25వ ఆర్థిక స్థిరత్వ నివేదిక’ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) డిసెంబర్ 27న విడుదల చేసింది.
‘‘ద్రవ్యలోటు గణాంకాలు గత కొన్నేళ్లలో మెరుగుపడ్డాయి. కానీ, ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు బలహీన పడడం కారణంగా తగ్గిపోతున్న ఆదాయంతో ద్రవ్యలోటు సవాలు కాగలదు’’ అని ఈ నివేదిక పేర్కొంది. చాలా ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని అభిప్రాయపడింది. పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం ద్రవ్య గణాంకాలపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
గరిష్టస్థాయికి విదేశీ మారకపు నిల్వలు
భారత విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు జీవితకాల గరిష్టస్థాయికి చేరాయి. డిసెంబరు 20తో ముగిసిన వారానికి 456 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3,200 కోట్లు) పెరిగి, 454.95 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.32.3 లక్షల కోట్లు) చేరాయని ఆర్‌బీఐ వెల్లడించింది. అంత క్రితం వారం ఫారెక్స్ నిల్వలు 1.07 బి.డాలర్లు పెరిగి, 454.49 బి.డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 25వ ఆర్థిక స్థిరత్వ నివేదిక విడుదల
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను 2011 జనాభా లెక్కల ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
ఇందుకు సంబంధించి అత్యంత కీలకమైన రిజర్వేషన్లను సైతం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో డిసెంబర్ 27న సమావేశమైన మంత్రివర్గం ఎన్నికల రిజర్వేషన్లతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
మంత్రివర్గ నిర్ణయాలు ఇలా..
- 2011 జనాభా గణన ఆధారంగా బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19.08, ఎస్టీలకు 6.77 శాతం.. మొత్తం 59.85 శాతం రిజర్వేషన్ల దామాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం- 1994 ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ.
- కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో 6.04 ఎకరాలు కేటాయింపు. మార్కెట్ విలువ ఎకరా రూ.43 లక్షలు ఉన్నప్పటికీ ఎకరా రూ.లక్షకే కేటాయించాలని నిర్ణయం.
- వైఎస్సార్ జిల్లా రాయచోటిలో 4 ఎకరాలను రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు బదలాయించేందుకు ఆమోదం.
- మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ రైట్స్ నిర్మాణ సంస్థకు అప్పగిస్తూ ఇన్‌క్యాబ్ సీఎండీ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
- మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిర్మించడం కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు అనుమతి.
- రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న కృష్ణపట్నం సముద్ర ముఖపరిధిని కుదించాలని నిర్ణయం.
- 412 సరికొత్త 108 సర్వీసు వాహనాలను వచ్చే ఏడాది మార్చి ఆఖరులోగా రూ.71.48 కోట్లతో కొనుగోలు.
- ఆరోగ్య పరీక్షలు నిర్వహించే 104 సర్వీసుల కోసం 656 వాహనాలను రవాణా వ్యయంతో కలిపి మొత్తం రూ.60.51 కోట్లతో మార్చి ఆఖరులోగా కొనుగోలు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఏపీ రాజధాని అంశంపై హైపవర్ కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణంపై అధ్యయనం చేసిన జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ, ప్రపంచ ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు (బీసీజీ) నివేదికల్లోని అంశాల సమగ్ర, తులనాత్మక పరిశీలనకు హైపవర్ కమిటీ ఏర్పాటు కానుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో డిసెంబర్ 27న సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయించింది. ఈ హైపవర్ కమిటీని మంత్రులు, సీనియర్ ఐఏఎస్‌లతో ఏర్పాటు చేయాలని తీర్మానించింది.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఇవే అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని బీసీజీని సైతం ఇప్పటికే ప్రభుత్వం కోరింది. ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసి రిపోర్టు సమర్పించడం కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది.
వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు కొత్త పాలసీ
రాష్ట్రంలో 191 మార్కెట్ యార్డులు, 150 ఉప మార్కెట్ యార్డులు.. మొత్తం 341 చోట్ల వ్యవసాయ ఉత్పత్తుల శాశ్వత కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేవలం కోతల సమయంలోనో, వ్యవసాయ ఉత్పత్తులు చేతికొచ్చే సమయంలోనే కాకుండా 365 రోజులూ ఇవి పనిచేసేలా నూతన విధానం అమలవుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ రాజధాని అంశంపై హైపవర్ కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎందుకు : జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు (బీసీజీ) నివేదికలపై అధ్యయనం చేసేందుకు