Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ 27/01/2020

డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సు ముగింపు

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 21న ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సు జనవరి 24న ముగిసింది.

Current Affairs

ఈ సదస్సులో ఎన్నో అంశాలపై ప్రగతిని సాధించినట్టు డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గేబ్రెండే చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ/ప్రైవేటు సహకారం అన్నది ఎంతో కీలకమైనదిగా అభివర్ణించారు.అంతర్జాతీయంగా సమ్మిళిత, స్థిరమైన వృద్ధి కోసం ఓఈసీడీతో కలసి పనిచేస్తామని ప్రకటించారు. 2030కి లక్ష కోట్ల చెట్ల సంరక్షణ, పెంపకం లక్ష్యానికి సహకరిస్తామని, నాలుగో పారిశ్రామిక విప్లవానికి వీలుగా పునఃనైపుణ్య శిక్షణ తదితర కార్యక్రమాలను ప్రకటించారు.

డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సు థీమ్ : Stakeholders for a Cohesive and Sustainable World (సమైక్య మరియు సుస్థిర ప్రపంచానికి వాటాదారులు)

మందగమనం తాత్కాలికమే: ఐఎంఎఫ్
సదస్సు ముగింపు కార్యక్రమంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా మాట్లాడుతూ.. భారత్‌లో వృద్ధి మందగమనం తాత్కాలికమేనని, ఇకపై వృద్ధి పుంజుకుంటుందని అన్నారు. 2019 అక్టోబర్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంచనాలు ప్రకటించినప్పటితో పోలిస్తే 2020 జనవరిలో మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.

గోయల్ కీలక భేటీలు
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ డబ్ల్యూఈఎఫ్ సదస్సు సందర్భంగా జనవరి 24న పలు కీలక నేతలతో చర్చలు జరిపారు. సమగ్రాభివృద్ధి, పారదర్శకత దిశగా సంస్కరణలకు భారత్ సిద్ధంగా ఉందని డబ్ల్యూటీవో చీఫ్ రాబర్టో అజవేదోతో చెప్పారు. ఈయూ వాణిజ్య కమిషనర్ ఫిల్ హోగన్, ప్రముఖ ఆర్థికవేత్త మేఖేల్ స్పెన్స్, బ్లాక్‌స్టోన్ గ్రూపు చైర్మన్ ష్వార్జ్‌మాన్, ఏబీబీ చైర్మన్ పీటర్ వోసర్ తదితరులతోనూ గోయల్ చర్చించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సు ముగింపు
ఎప్పుడు : జనవరి 24
ఎక్కడ : దావోస్, స్విట్జర్లాండ్

ఢిల్లీలో ఐటీఏటీ వ్యవస్థాపక దినోత్సవం

దేశ రాజధాని న్యూఢిల్లీలో జనవరి 24న ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) 79వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Current Affairs

ఈ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే హాజరై మాట్లాడారు. పన్ను వివాదాలకు వేగంగా పరిష్కారం చూపించాలని, అలా చేస్తే అది పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకంగా మారుతుందని జస్టిస్ బాబ్డే అన్నారు. పన్నుల ఎగవేతను తోటి పౌరులకు చేసే సామాజిక అన్యాయంగా పేర్కొన్నారు. అదే విధంగా ఏకపక్షమైన, అధిక పన్ను విధింపు అన్నది ప్రభుత్వం ద్వారా సామాజిక అన్యాయానికి దారితీస్తుందన్నారు. పరోక్ష పన్నులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులు, సీఈఎస్‌టీఏటీలోని పెండింగ్ కేసుల్లో 61%(1.05 లక్షల కేసులకు) గత రెండేళ్ల కాలంలో తగ్గించామని చెప్పారు. ఐటీఏటీను 1941, జనవరి 25న స్థాపించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) 79వ వ్యవస్థాపక దినోత్సవ ం
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే
ఎక్కడ : న్యూఢిల్లీ

ప్రముఖ మహిళల పేరిట విద్యాపీఠాలు ఏర్పాటు

పది మంది ప్రముఖ మహిళల పేరిట వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యాపీఠాలను నెలకొల్పనున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ జనవరి 24న ప్రకటించింది.

Current Affairs

పరిపాలనదక్షులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, సంఘసంస్కర్తలుగా తమదైన ముద్రవేసిన ప్రముఖ మహిళల పేరిట ఈ పీఠాలు ఏర్పాటవుతాయని తెలిపింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సాయంతో వీటిని నెలకొల్పనున్నట్లు పేర్కొంది. ఈ విద్యాపీఠాల్లో ఆయా రంగాల్లో పరిశోధనలు చేపట్టనున్నారు. తొలుత ఐదేళ్ల కాలవ్యవధికి మాత్రమే వీటిని నెలకొల్పుతారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, మహాదేవి వర్మ, రాణి గైదిన్‌లియు తదితరుల పేరిట ఈ విద్యాపీఠాలు ఏర్పాటుకానున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 10 మంది ప్రముఖ మహిళల పేరిట విద్యాపీఠాలు ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ
ఎక్కడ : దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో
ఎందుకు : వివిధ రంగాల్లో పరిశోధనలు చేపట్టేందుకు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close