Current Affairs
Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ 24/01/2020
ఏపీలో 11,158 రైతు భరోసా కేంద్రాలు
రైతులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి 11,158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
విత్తనం దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు రైతుకు అవసరమైన సాయాన్ని ఈ కేంద్రాల ద్వారా తమ ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామ సచివాలయం పక్కనే రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 22న అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై జరిగిన చర్చలో సీఎం ఈ మేరకు వివరించారు. ఈ కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయంతో పాటు వ్యవసాయ సూచనలు, పండిన పంట కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ
రాజధాని అమరావతి భూముల కొనుగోళ్లలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జనవరి 22న ఆమోదం తెలిపింది. హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ భూ కుంభకోణంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ప్రాథమికంగా 4,070 ఎకరాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిర్ధారించి దీనిపై మరింత సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరముందని సూచించిందని తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా
ఎందుకు : రైతులకు అన్ని విధాలా సాయం అందించేందుకు
ప్రజాస్వామ్య సూచీలో భారత్‌కు 51వ స్థానం
ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) జనవరి 22న విడుదల చేసిన ప్రపంచ ప్రజాస్వామ్య సూచీ-2019లో భారత్ 51వ స్థానంలో నిలిచింది.
2018తో పోలిస్తే 2019లో భారత్ పది స్థానాలు దిగజారింది. దేశంలో పౌర హక్కులు హరించుకుపోతుండటమే ఇందుకు కారణమని ఈఐయూ వివరించింది. ప్రపంచంలోని 165 స్వతంత్ర దేశాలు, 2 స్వతంత్ర ప్రాంతాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ అమలు తీరుపై ఈఐయూ ఈ అంచనాలను రూపొందించింది. 2018లో ప్రజాస్వామ్య సూచీలో ఈఐయూ భారత్‌కు 7.23 పాయింట్లు ఇవ్వగా 2019కు వచ్చేసరికి 6.90 పాయింట్లు మాత్రమే కేటాయించింది.
భారత్‌లో బలహీన ప్రజాస్వామ్యం..
ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, ప్రభుత్వం పనిచేసే విధానం, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌర హక్కులు.. అనే అంశాల ఆధారంగా ఈ ఇండెక్స్‌ను ఈఐయూ రూపొందించింది. ఈ అంశాల్లో వచ్చిన పాయింట్ల ఆధారంగా ఆయా దేశాలను సంపూర్ణ ప్రజాస్వామ్యం (8 కంటే ఎక్కువ పాయింట్లు), బలహీన ప్రజాస్వామ్యం(6 పాయింట్ల కంటే ఎక్కువ.. 8 లేదా అంతకంటే తక్కువ), మిశ్రమ పాలన (4 కంటే ఎక్కువ, 6 కంటే తక్కువ), నియంతృత్వం (4 లేదా అంతకంటే తక్కువ పాయింట్లు). ఇందులో 8 కంటే తక్కువ 6 కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన భారత్‌లో బలహీన ప్రజాస్వామ్యం ఉందని తేల్చింది.
ఈఐయూ ప్రపంచ ప్రజాస్వామ్య సూచీ-2019
ర్యాంకు | దేశం |
1 | నార్వే |
2 | ఐస్‌ల్యాండ్ |
3 | స్వీడన్ |
4 | న్యూజిలాండ్ |
5 | ఫిన్‌లాండ్ |
51 | భారత్ |
52 | బ్రెజిల్ |
69 | శ్రీలంక |
80 | బంగ్లాదేశ్ |
108 | పాకిస్థాన్ |
134 | రష్యా |
153 | చైనా |
163 | చాద్ |
164 | సిరియా |
165 | సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ |
166 | రిపబ్లిక్ ఆఫ్ కాంగో |
167 | ఉత్తరకొరియా |
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రజాస్వామ్య సూచీలో భారత్‌కు 51వ స్థానం
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ)
ఎక్కడ : ప్రపంచంలో
డబ్ల్యూఈఎఫ్ పారిశ్రామిక సభ్య దేశంగా భారత్
ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) పునఃనైపుణ్య విప్లవాత్మక కార్యక్రమంలో భారత్ వ్యవస్థాపక సభ్య దేశంగా చేరింది.
నాలుగో పారిశ్రామిక విప్లవానికి చేయూతగా 2030 నాటికి 100 కోట్ల మందికి మెరుగైన విద్య, నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.
దక్షిణ కొరియా మంత్రితో గోయల్ భేటీ
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సుకు హాజరైన దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి యూమైంగ్‌హితో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ జనవరి 22న భేటీ అయ్యారు. వీరి మధ్య ద్వైపాక్షిక వాణిజ్య అంశాలు చర్చకు వచ్చాయి. భారతీయ రైల్వే రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే అంశంపైనా చర్చ నిర్వహించారు. పలు కంపెనీల సీఈవోలూ సమావేశమయ్యారు.
ఐటీ గవర్నర్ల కమ్యూనిటీ చైర్మన్‌గా విజయ్‌కుమార్
డబ్ల్యూఈఎఫ్ ఐటీ గవర్నర్ల కమ్యూనిటీకి చైర్మన్‌గా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో సీ విజయ్‌కుమార్ పనిచేయనున్నారు. ఈ విషయాన్ని డబ్ల్యూఈఎఫ్ ప్రకటించింది