Current Affairs
Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 22/12/2019
ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ నివేదిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై ఏర్పాటైన జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ తన నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది.
125 పేజీలతో కూడిన ఈ నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి డిసెంబర్ 20న అందజేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా అమరావతిలో శాసన రాజధాని(లెజిస్లేటివ్ క్యాపిటల్), విశాఖలో పరిపాలన రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూలులో న్యాయ రాజధాని (జ్యుడీషియల్ క్యాపిటల్) ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ తన నివేదికలో సూచించింది.
నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు
అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది.
ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఇవే..
- ఉత్తరాంధ్ర: శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం
- మధ్య కోస్తా: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా
- దక్షిణ కోస్తా: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
- రాయలసీమ: వైఎస్సార్, చిత్తూరు, కర్నూలు, అనంతపురం
కమిటీ ప్రధాన సిఫార్సులు..
- మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లో ఉన్నట్టు రాష్ట్రంలో అమరావతి, విశాఖపట్నంలో శాసన(లెజిస్లేచర్) వ్యవస్థ ఉండాలి. అసెంబ్లీ అమరావతిలో ఉన్నా.. వేసవికాల సమావేశాలు విశాఖలో నిర్వహించాలి. విశాఖపట్నంలో సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలు, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. అమరావతిలో అసెంబ్లీతో పాటు హైకోర్టు బెంచ్, సీఎం క్యాంపు కార్యాలయం, రాజ్‌భవన్ ఉండాలి. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో నిర్వహించాలి.
- అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకేచోట ఉంచాల్సిన అవసరం లేదని కె.సి.శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. అమరావతిలో భూమి తీరు, వరద ప్రభావం తదితర అంశాల కారణంగా రాజధాని కార్యకలాపాల్ని ఇతర నగరాలకు వికేంద్రీకరించాలి. ఇక్కడ దాదాపుగా పూర్తైన నిర్మాణాలను వినియోగంలోకి తీసుకురావాలి. అమరావతిలో ప్రతిపాదిత నిర్మాణాల్ని తగ్గించాలి. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం రివర్ ఫ్రంట్ నిర్మాణాలు ఉండరాదు. వరద ముంపు నుంచి రక్షణ కోసం చేపట్టిన నిర్మాణాలు పూర్తి చేయాలి. సీడ్ యాక్సిస్ రోడ్డును నేషనల్ హైవేకు అనుసంధానించాలి.
- శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి.
- పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలను సత్వరం పరిష్కారం దొరుకుతుంది.
రాష్ట్రమంతా అధ్యయనం…
జీఎన్ రావు కమిటీ మొత్తం సుమారు 10,600 కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటించి రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసింది. ఈ కమిటీకి జీఎన్ రావు కన్వీనర్‌గా వ్యవహరించారు. సభ్యులుగా విజయమోహన్, ఆర్.అంజలీ మోహన్, డాక్టర్ మహావీర్, డాక్టర్ సుబ్బారావు, కేటీ రవీంద్రన్, అరుణాచలం ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడితో రాజ్‌నాథ్, జైశంకర్‌లు భేటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు.
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో డిసెంబర్ 20న జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అలాగే వాణిజ్య అంశాలపై చర్చ జరిగినట్లు మంత్రి జైశంకర్ తెలిపారు.
మరోవైపు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, డిఫెన్స్ సెక్రటరీ మైక్ ఎస్పర్‌లతో రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ… భారత్ నుంచి వస్తున్న ప్రతిభావంతులను అడ్డుకోరాదని అమెరికాకు సూచించారు. ఇరు దేశాల మధ్య వారి సేవలు వ్యూహాత్మక వారధిగా పనిచేస్తాయని, ఆర్థిక సహకారంలోనూ ఇది ముఖ్యమైన భాగమని స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్
ఎక్కడ : వైట్‌హౌస్, అమెరికా
ఎందుకు : ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు
పినాక క్షిపణి పరీక్ష విజయవంతం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పినాక క్షిపణి వ్యవస్థను భారత రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి డిసెంబర్ 20న ఈ క్షిపణిని పరీక్షించింది. డీఆర్‌డీవో రూపొందించిన ఈ క్షిపణి 75 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ శాఖ పేర్కొంది.
పినాక ఎంకే-2 రాకెట్‌ను నేవిగేషన్, నియంత్రణ, మార్గదర్శకత్వ సాయంతో కచ్చితత్వం సాధించే క్షిపణిగా రూపాంతరం చెందించారు. ఈ క్షిపణి నావిగేషన్ వ్యవస్థకు భారత ప్రాంతీయ నేవిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ (ఐఆర్‌ఎన్ ఎస్‌ఎస్) కూడా సాయమందిస్తుంది. ఇలాంటి ఫిరంగి క్షిపణి వ్యవస్థను డిసెంబర్ 10న విజయవంతంగా పరీక్షించారు. 2019, మార్చిలోనూ పినాక మార్గదర్శక రాకెట్ వ్యవస్థలను రాజస్థాన్‌లోని పోఖ్రాన్ నుంచి విజయవంతంగా పరీక్షించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పినాక క్షిపణి వ్యవస్థ పరీక్ష విజయవంతం
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : భారత రక్షణ శాఖ
ఎక్కడ : చాందీపూర్, బాలసోర్ జిల్లా, ఒడిశా