Current Affairs
Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 15/01/2020
పెద్దపల్లి జిల్లా స్వచ్ఛత దర్పణ్ అవార్డు
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు ‘స్వచ్ఛత దర్పణ్ అవార్డు’ లభించింది.
న్యూఢిల్లీలో జనవరి 12న జరిగిన కార్యక్రమంలో పాణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖాన్, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత సాధించినందుకుగాను జిల్లాకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సమాచారం, విద్య, కమ్యూనికేషన్ (ఐఈసీ), సామాజిక మరుగుదొడ్లు’ అనే అంశంపై పెద్దపల్లి కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వచ్ఛత దర్పణ్ అవార్డు విజేత
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : పెద్దపల్లి జిల్లా
ఎందుకు : పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగైన పనితీరు కనబరిచినందుకు
డ్రోన్ల రిజిస్ట్రేషన్‌పై విమానయాన శాఖ ఆదేశాలు
దేశంలో డ్రోన్లను కలిగి ఉన్న వ్యక్తులందరూ 2020, జనవరి 31లోగా స్వచ్ఛందంగా రిజిస్టర్ చేసుకోవాలని కేంద్ర విమానయాన శాఖ జనవరి 13న తెలిపింది.
నిర్దేశిత గడువులోగా రిజిస్టర్ చేసుకోని డ్రోన్ల ఆపరేటర్లపై ఐపీసీ సెక్షన్, ఎయిర్‌క్రాఫ్ట్ చట్టాల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆన్‌లైన్ విధానంలో డ్రోన్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది. డీజీసీఏ నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇరాన్ సైనిక దళ కమాండర్ ఖాసీం సులేమానీపై అమెరికా డ్రోన్ సాయంతో హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రోన్ ఆపరేటర్లకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డ్రోన్ల రిజిస్ట్రేషన్‌పై ఆదేశాలు
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : కేంద్ర విమానయాన శాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ప్రార్థన స్థలాల్లో మహిళలపై వివక్ష
కేరళలోని శబరిమల ఆలయంతోపాటు వేర్వేరు మతాల్లో, ప్రార్థన స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించి ఏయే అంశాలపై చర్చించాలో నిర్ణయించేందుకు 2020, జనవరి 17న సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా దేశ అత్యున్నత న్యాయస్థానం నలుగురు సీనియర్ న్యాయవాదులను జనవరి 13న ఆదేశించింది.
ఇదే సమయంలో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేది లేదని స్పష్టం చేసింది.
‘‘శబరిమల కేసులో తీర్పును సమీక్షించబోవడం లేదు. గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రస్తావించిన అంశాలను పరిగణిస్తున్నాం’’ అని చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం తెలిపింది. మతపరమైన వ్యవహారాల్లో న్యాయస్థాన జోక్యం ఎంతవరకూ ఉండాలన్న దానిపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం కొన్ని అంశాలను లేవనెత్తిందని, వాటిపై మాత్రమే తాము విచారణ చేపడతామని తెలిపింది. ప్రార్థన స్థలాల్లో మహిళలు, బాలికల ప్రవేశంపై నిషేధం ఒక్క శబరిమలకు మాత్రమే పరిమితం కాలేదని గతంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పరిశీలనకు ఇవి..: మసీదుల్లో మహిళల ప్రవేశం, దావూదీ బోహ్రా తెగల్లో మహిళల జననాంగాల విచ్చిత్తి, పార్శీ మహిళను పెళ్లాడిన పార్శీయేతర పురుషులకు వారి ప్రార్థన స్థలంలో ప్రవేశంపై నిషేధం వంటి పలు అంశాలపై దాఖలైన పిటిషన్లను వేరుగా విచారించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీలతో కూడిన నలుగురు సీనియర్ న్యాయవాదులు సమావేశమై ఏయే అంశాలపై తాము విచారణ జరపాలో సూచించాలని ఆదేశాలు జారీ చేసింది.