Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 09/12/2019

నవంబర్ 2019 అంతర్జాతీయం

ట్విట్టర్‌లో రాజకీయ ప్రచారం నిలిపివేత

Current Affairs

ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వేదికపై రాజకీయ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ట్విట్టర్‌ను వాడుకుంటే కోట్లాదిమందిపై ప్రభావం పడుతుందని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ అక్టోబర్ 31న పేర్కొన్నారు.

యునెస్కో డిఫెన్సెస్ నివేదిక విడుదల
నవంబర్ 2ను ‘ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్స్ అగెనైస్ట్ జర్నలిస్ట్స్’గా జరుపుకుంటున్న నేపథ్యంలో యునెస్కో నవంబర్ 1న ‘ఇంటెన్సిఫైడ్ అటాక్స్, న్యూ డిఫెన్సెస్’ అనే నివేదికను విడుదల చేసింది.
యునెస్కో డిఫెన్సెస్ నివేదిక-ముఖ్యాంశాలు

  • 2017, 2018లో 55 శాతం జర్నలిస్ట్‌ల హత్యలు ఘర్షణాత్మక వాతావరణంలేని ప్రాంతాల్లోనే జరిగాయి.
  • నేరాలు, అవినీతి, రాజకీయాలపై పాత్రికేయులు జరిపిన రిపోర్టింగ్ కారణంగానే ఈ హత్యలు జరిగాయి.
  • ప్రపంచవ్యాప్తంగా 2006 నుంచి 2018 మధ్య 1109 మంది జర్నలిస్ట్‌లు హత్యకు గురయ్యారు. అయితే ఆ హత్యలకు బాధ్యులైన వారిలో 90 శాతం మందికి శిక్షలు పడలేదు.
  • 2014 కన్నా ముందు ఐదేళ్లలో జరిగిన జర్నలిస్ట్‌ల హత్యల కన్నా 2014 తరువాతి ఐదేళ్లలో జరిగిన జర్నలిస్ట్‌ల హత్య లు 18 శాతం పెరిగాయి.
  • ముఖ్యంగా పాత్రికేయుల హత్యల్లో 30 శాతం అరబ్ దేశాల్లో, 26 శాతం లాటిన్ అమెరికా కరేబియన్ ప్రాంతంలో, 24 శాతం ఆసియా పసిఫిక్ దేశాల్లో చోటు చేసుకున్నాయి.

బ్యాంకాక్‌లో తూర్పు ఆసియా దేశాల సదస్సు
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నవంబర్ 4న 14వ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు(ఈఏఎస్) జరిగింది. ఉగ్రవాదాన్ని, అంతర్జాతీయ నేరాలను అరికట్టడానికి మరింత ముమ్మరమైన ప్రయత్నాలు చేయాలని, ఐరాసలోని సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకోవాలని ఈ సదస్సు తీర్మానించింది. ఈ సమావేశంలో భారత్ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈఏఎస్‌ను 2020లో భారత్‌లోని చెన్నైలో నిర్వహించాలని ఈ సందర్భంగా మోదీ కోరారు.
ఈఏఎస్‌లోని 18 సభ్య దేశాలు
ఆస్ట్రేలియా, బ్రూనై, కాంబోడియా, చైనా, భారత్, ఇండోనేషియా, జపాన్, లావోస్, మలేషియా, మయన్మార్, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, రష్యా, సింగపూర్, దక్షిణ కొరియా, థాయిలాండ్, అమెరికా, వియత్నాం.
జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులతో మోదీ భేటీ
తూర్పు ఆసియా దేశాల సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, వియత్నాం ప్రధాని గుయెన్ చాన్ ఫుక్, జపాన్ ప్రధాని షింజో అబెలతో ప్రధాని మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. కీలక ద్వైపాక్షిక, భద్రత, వాణిజ్యం, ప్రాంతీయ అంశాలపై వారితో చర్చలు జరిపారు. మరోవైపు మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీతోనూ మోదీ సమావేశమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుబాటుదారులను నియంత్రించేందుకు సహకారం అందించాలని ఆమెను మోదీ కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 14వ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు(ఈఏఎస్)
ఎప్పుడు: నవంబర్ 4
ఎక్కడ: బ్యాంకాక్, థాయ్‌లాండ్

థాయ్‌లాండ్‌లో ఆర్‌సెప్ సదస్సు
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నవంబర్ 4న జరిగిన ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ-ఆర్‌సెప్)’ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ… ‘ఆర్‌సీఈపీ చర్చల ప్రారంభంలో అంగీకరించిన మౌలిక స్ఫూర్తి ప్రస్తుత ఒప్పందంలో పూర్తిగా ప్రతిఫలించడం లేదు. భారత్ లేవనెత్తిన వివాదాస్పద అంశాలు, ఆందోళనలకు సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. ఈ పరిస్థితుల్లో ఆర్‌సెప్ ఒప్పందంలో భాగస్వామిగా చేరడం భారత్‌కు సాధ్యం కాదు’ అని ప్రకటించారు. ఈ ఒప్పందం భారతీయుల జీవితాలు, జీవనాధారాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.
ఆర్‌సెప్ ఆమోదం పొందితే
ఆర్‌సెప్ ఆమోదం పొందితే .. ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ప్రాంత ఒప్పందంగా నిలిచేది. దాదాపు ప్రపంచ జనాభాలో సగం మందితో పాటు, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 40 శాతం, ప్రపంచ జీడీపీలో 35 శాతం ఈ ఒప్పంద పరిధిలో ఉండేవి.
15 దేశాలు సిద్ధం
ఆర్‌సెప్ ఒప్పందాన్ని భారత్ మినహా మిగతా 15 దేశాలు ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒప్పందంలో చేరబోవడం లేదని భారత్ స్పష్టం చేసిన అనంతరం.. 2020వ సంవత్సరంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తామని మిగతా 15 దేశాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.
ఆర్‌సెప్‌లో భారత్ చేరకపోవడానికి కారణాలు

  • వాణిజ్య లోటు భర్తీని తీర్చడానికి, ధరల మధ్య వ్యత్యాసానికి తగిన పరిష్కారం కనిపించకపోవడం.
  • దాదాపు 90% వస్తువులపై దిగుమతి సుంకాలను ఎత్తివేసేలా ఒప్పందం ఉండడం.
  • వివిధ దేశాల నుంచి, ముఖ్యంగా చవకైన చైనా వ్యావసాయిక ఉత్పత్తులు, పారిశ్రామిక ఉత్పత్తులు భారత మార్కెట్‌ను ముంచెత్తే ప్రమాదం.
  • అత్యంత ప్రాధాన్య దేశాల (ఎంఎఫ్‌ఎన్) హోదాను మరికొన్ని దేశాలకు ఇవ్వాల్సిన పరిస్థితులు రానుండడం.
  • టారిఫ్ తగ్గింపులకు ప్రాతిపదిక ఏడాదిగా 2014ని పరిగణించాలనడం.

2012 నుంచి చర్చలు
ఆర్‌సెప్ చర్చలు 21వ ఆసియాన్ సదస్సు సందర్భంగా నవంబర్, 2012లో ప్రారంభమయ్యాయి. 10 ఆసియాన్ సభ్య దేశాలు(ఇండోనేసియా, థాయిలాండ్, సింగపూర్, ఫిలిప్పైన్స్, మలేసియా, వియత్నాం, బ్రూనై, కాంబోడియా, మయన్మార్, లావోస్) 6 భాగస్వామ్య దేశాలు(భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్) ఈ చర్చల్లో పాలు పంచుకున్నాయి. ‘ఆధునిక, సమగ్ర, అత్యున్నత ప్రమాణాలతో కూడిన, పరస్పర ప్రయోజనకర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద రూపకల్పన’ లక్ష్యంగా ఆర్‌సీఈపీ చర్చలు ప్రారంభమయ్యాయి.
చైనా ఒత్తిడి
అర్‌సీఈపీ ఒప్పందం సభ్య దేశాల ఆమోదం పొందాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సభ్యదేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తెస్తోంది. అమెరికాతో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం విపరిణామాలను సమతౌల్యం చేసుకోవడం, ఈ ప్రాంత ఆర్థిక సామర్థ్యాన్ని అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు చూపడం చైనా లక్ష్యాలుగా పెట్టుకుంది. ఈ ఒప్పందాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ఆ లక్ష్యాలను సాధించాలని చూస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ-ఆర్‌సెప్)’ సదస్సు
ఎప్పుడు: నవంబర్ 4
ఎక్కడ: బ్యాంకాక్, థాయ్‌లాండ్

రుగ్మతగా ఆన్‌లైన్ షాపింగ్ : గార్టనర్
ఆన్‌లైన్ షాపింగ్‌ను ఒక వ్యసనపరమైన రుగ్మతగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించే అవకాశం ఉందని అంతర్జాతీయ అధ్యయన సంస్థ గార్టనర్ వెల్లడించింది. కాలు కదపకుండా ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో ఎడాపెడా కొనేసే అలవాటు వల్ల ఒత్తిడికీ, మానసిక ఆందోళనకు గురవుతారని డబ్ల్యూహెచ్‌వో గుర్తించినట్టు పేర్కొంది. ఆన్‌లైన్ షాపింగ్‌ని దుర్వినియోగం చేసుకోవడం కారణంగా లక్షలాది మంది ఆర్థిక ఒత్తిడికి లోనవుతారని, ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా వినియోగదారులు చేసే వ్యయం ఏడాదికి 10 శాతం చొప్పున పెరుగుతోందని వివరించింది. 2024 ఏడాదికల్లా ఆన్‌లైన్ షాపింగ్ ఒక వ్యసనపరమైన రుగ్మతగా మారే ప్రమాదముందని తెలిపింది.

పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగిన అమెరికా
భూతాపాన్ని కట్టడి చేయడానికి కుదిరిన పారిస్ వాతావరణ ఒప్పందం-2015 నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా లాంఛనంగా ఐక్యరాజ్య సమితి (ఐరాస)కి తెలియజేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఒక నోటీసు అందజేశారు. నోటీసు ఇచ్చిన ఏడాది తర్వాత అది అమలవుతుంది. అంటే.. 2020 ఏడాది నవంబర్ 4న అమెరికా ఈ ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలుగుతుంది.
చరిత్రాత్మకమైన పారిస్ ఒప్పందంపై భారత్ సహా 188 దేశాలు సంతకాలు చేశాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇందులో కీలక పాత్ర పోషించారు. ఒబామా తర్వాత అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా పరిశ్రమల పోటీతత్వాన్ని దెబ్బతీయడానికి భారత్, చైనా వంటి దేశాలకు సాధికారత కల్పించడానికే దీన్ని తెచ్చారని ఆరోపించారు. ఒప్పందం నుంచి వైదొలుగుతామని 2017, జూన్ 1న ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పారిస్ వాతావరణ ఒప్పందం-2015 నుంచి వైదొలుగుతాం
ఎప్పుడు: నవంబర్ 5
ఎవరు: అమెరికా

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close