Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 06/12/2019

భారత్ బాండ్ ఈటీఎఫ్‌కు కేబినెట్ ఆమోదం

దేశంలోనే తొలి కార్పొరేట్ బాండ్ ఈటీఎఫ్ (భారత్ బాండ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్) ప్రారంభానికి డిసెంబర్ 4న ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Current Affairs

ఈ ఈటీఎఫ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అదనపు నిధుల సమీకరణ సులభం కానుంది. ఈటీఎఫ్ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ… ‘‘భద్రత, లిక్విడిటీ, పన్ను లేని స్థిరమైన రాబడులను బాండ్ ఈటీఎఫ్ అందిస్తుంది’’ అని వివరించారు. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం రూ.1,000 నుంచి బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

భారత్- 22 ఈటీఎఫ్ మాదిరిగా ‘భారత్ బాండ్ ఈటీఎఫ్’నూ స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ చేస్తారు. అవసరమైతే విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 బాండ్ ఈటీఎఫ్ (భారత్ బాండ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్) ప్రారంభానికి ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : కేంద్ర కేబినెట్

అల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్

టెక్ దిగ్గజం గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సీఈఓ)గా ఉన్న సుందర్ పిచాయ్… తాజాగా దాని మాతృసంస్థ అల్ఫాబెట్‌కూ సీఈవోగా నియమితులయ్యారు.

Current Affairs

ఇప్పటిదాకా ఈ బాధ్యతల్లో ఉన్న గూగుల్ సహ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్ వాటి నుంచి తప్పుకున్నారు. తాజా పరిణామంతో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకరిగా సుందర్ పిచాయ్ నిలవనున్నారు. కొత్త మార్పులపై కంపెనీ ఉద్యోగులకు పేజ్, బ్రిన్ డిసెంబర్ 4న లేఖ రాశారు. రాబోయే రోజుల్లోనూ బోర్డు సభ్యులుగా, షేర్‌హోల్డర్లుగా, సహ-వ్యవస్థాపకులుగా గూగుల్, అల్ఫాబెట్ వృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని లేఖలో పేర్కొన్నారు.

అల్ఫాబెట్(గూగుల్) ప్రస్తుత మార్కెట్ విలువ : 89,300 కోట్ల డాలర్లు
ఆదాయం(2018) : 13,682 కోట్ల డాలర్లు
నికర లాభం : 3,074 కోట్ల డాలర్లు
సుందర్ పిచాయ్ 2018 సంపాదన (షేర్ల విలువతో కలిపి) : 47 కోట్ల డాలర్లు (సుమారు రూ.3,300 కోట్లు)

మదురై టు సిలికాన్ వ్యాలీ…
తమిళనాడులోని మదురైలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సుందర్ పిచాయ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేశారు. తరవాత అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో ఎంఎస్ చేశారు. ఎంబీఏ అనంతరం 2004లో గూగుల్‌లో చేరారు. కీలకమైన క్రోమ్ బ్రౌజర్ ప్రాజెక్టును విజయవంతం చేశాక కంపెనీలో ఆయన వేగంగా ఎదిగారు. 2013లో ముఖ్యమైన ఆండ్రాయిడ్ డివిజన్ ఇన్‌చార్జిగా… తర్వాత రెండేళ్లకే 2015లో గూగుల్ సీఈవో అయ్యారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 అల్ఫాబెట్ సీఈవోగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సీఈఓ) సుందర్ పిచాయ్

పౌరసత్వ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం

వివాదాస్పద పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లుకు డిసెంబర్ 4న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Current Affairs

పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు, వివక్షను ఎదుర్కొంటూ భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లును రూపొందించారు. అయితే భారత్ లౌకికత్వానికి ఈ మతతత్వ బిల్లు వ్యతిరేకమని విపక్షాలు వాదిస్తున్నాయి.

చట్టసభల్లో రిజర్వేషన్ల పొడిగింపునకు ఆమోదం
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు(ఎస్సీ, ఎస్టీ) రిజర్వేషన్లను పొడిగించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు జనవరి 25, 2020తో ముగియనుండగా, వాటిని జనవరి 25, 2030 వరకు పొడిగించేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం పార్లమెంట్లో ఎస్సీ సభ్యులు 84 మంది, ఎస్టీ సభ్యులు 47 మంది ఉన్నారు. రాష్ట్రాల శాసనసభల్లో 614 ఎస్సీ, 554 ఎస్టీ సభ్యులున్నారు.

కేబినెట్ నిర్ణయాల్లో మరికొన్ని..

  • వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్ బిల్లుకు ఆమోదం. డేటా సేకరణ, నిల్వ, వినియోగం, సంబంధిత వ్యక్తుల ఆనుమతి, ఉల్లంఘనలకు జరిమానా, శిక్ష.. తదితరాలకు సంబంధించిన సమగ్ర విధి, విధానాలతో బిల్లును రూపొందించారు.
  • కేంద్ర సంస్కృత యూనివర్సిటీల ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం. మూడు డీమ్డ్ సంస్కృత యూనివర్సిటీలను సెంట్రల్ యూనివర్సిటీలుగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
  • ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 3.7 ఎకరాల స్థలాన్ని ఐటీడీసీ(ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్), ఐటీపీఓ(ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్)లకు రూ. 611 కోట్లకు 99 ఏళ్ల పాటు లీజుకు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం. ఈ స్థలంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్, ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మిస్తారు. 2021లోగా ఈ నిర్మాణం పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు, వివక్షను ఎదుర్కొంటూ భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించేందుకు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close