Current Affairs
Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 06/01/2020
అమెరికా దాడుల్లో ఇరాన్ జనరల్ సులేమాని మృతి
ఇరాన్‌లో అత్యంత శక్తిమంతమైన నాయకుడు, ఆ దేశ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ ఖాసీం సులేమాని అమెరికా జరిపిన దాడుల్లో మృతి చెందారు.
బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో జనవరి 3న సులేమాని ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై గగనతలం నుంచి డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సులేమానితోపాటు ఇరాక్‌కు చెందిన హషద్ అల్ షాబి పారామిలటరీ బలగాల డిప్యూటీ చీఫ్, ఇరాన్‌కు మద్దతుగా వ్యవహరించే కొందరు స్థానిక మిలిమెంట్లు మరణించారు.
2018లో అమెరికా ఇరాన్‌తో అణుఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పట్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడితో మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ పరిణామాలతో మధ్య ప్రాచ్యానికి అమెరికా మరో 3,500 మంది బలగాలను తరలించింది.
ఎప్పుడో చంపేయాల్సింది: ట్రంప్
విదేశాల్లో నిఘా కార్యకలాపాలు నిర్వహించే ఇరాన్ అల్ ఖుద్స్ చీఫ్ జనరల్ సులేమానిని కొన్నేళ్ల క్రితమే చంపేయాల్సి ఉండేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాక్‌తో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాల్లో అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకి, వేలాది మంది అమెరికన్ సిబ్బంది మృతికి సులేమాని కారకుడన్నారు.
ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్
సులేమాని చంపేసినందుకు అమెరికాపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయోతొల్లా అలీ ఖమేనియా హెచ్చరించారు. ఇస్మాయిల్ ఖానీని సులేమాని స్థానంలో ఖుద్‌స బలగాల చీఫ్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్ గుండెకు గాయం చేసిన వారిని విడిచిపెట్టమని తమకు సహకరించే దేశాలతో కలిసి బదులు తీర్చుకుంటామని అధ్యక్షుడు హసన్ రౌహని హెచ్చరించారు.
మరో యుద్ధం భరించలేం: ఐరాస
గల్ఫ్‌లో మరో యుద్ధాన్ని ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ వ్యాఖ్యానించారు. సులేమాని మృతి నేపథ్యంలో గ్యుటెరస్ పై విధంగా స్పందించారు.
ఎవరీ ఖాసీం సులేమాని?
1955లో ఇరాన్‌లో ఒక నిరుపేద రైతు కుటుంబంలో సులేమాని 1979లో ఇరాన్ విప్లవం సమయంలో రివ్యల్యూషనరీ గార్డ్‌లో చేరారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లో కీలకమైన నిఘా విభాగం అయిన ఖుద్స్ ఫోర్స్‌కి 1998 ఏడాది నుంచి సులేమాని మేజర్ జనరల్‌గా ఉన్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాబల్యాన్ని పెంచడానికి, దానిని బలమైన దేశంగా నిలపడానికి చాలా ఏళ్లుగా శ్రమిస్తున్నారు. ఇరాన్ సుప్రీం నాయకుడు తర్వాత దేశంలో అంతటి శక్తిమంతుడిగా సులేమానికి పేరుంది. విదేశాల్లో కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించడంలో దిట్ట అయిన సులేమాన్‌ను ఇరాన్ ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. 2017లో టైమ్ మ్యాగజైన్ ఆయనని అత్యంత ప్రభావశీలుర జాబితాలో చేర్చింది. మరోవైపు ఎన్నో దేశాల్లో మిలటరీ దాడుల వ్యూహకర్త అయిన సులేమానిని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ మృతి
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : ఖాసీం సులేమాని
ఎక్కడ : బాగ్దాద్ విమానాశ్రయం, ఇరాక్
ఎందుకు : అమెరికా క్షిపణి దాడుల కారణంగా
టీటీ ర్యాంకింగ్స్ లో మానవ్ ఠక్కర్ కు అగ్రస్థానం
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) జనవరి 3న విడుదల చేసిన ‘అండర్-21 పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్’లో భారత మానవ్ ఠక్కర్ అగ్రస్థానంలో నిలిచాడు.
2019, డిసెంబర్‌లో జరిగిన నార్త్ అమెరికా ఓపెన్ టోర్నీలో మానవ్ విజేతగా నిలిచాడు. దాంతో తాజా ర్యాంకింగ్స్ లో మానవ్ తొమ్మిది స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్‌ను అధిరోహించాడు. గతంలో భారత్ తరఫున అండర్-21 విభాగంలో హర్మీత్ దేశాయ్, సత్యన్, సౌమ్యజిత్ ఘోష్ ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచారు.
రోహిత్ శర్మ పేరుతో క్రికెట్ స్టేడియం
భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరుతో క్రికెట్ స్టేడియం నిర్మితం కానుంది.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామ పంచాయతీలోని శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమంలో ఈ స్టేడియానికి జనవరి 3న శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రోహిత్ శర్మ, అతడి భార్య రితిక పాల్గొన్నారు. దేశానికి ఉత్తమ క్రీడాకారులను అందించే లక్ష్యంతో స్టేడియం, శిక్షణ కేంద్రం నిర్మించబోతున్నట్లు మిషన్ మార్గదర్శకుడు కమలేష్ పటేల్ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐటీటీఎఫ్ టేబుల్ టెన్నిస్ అండర్-21 పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్‌సలో అగ్రస్థానం
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : మానవ్ ఠక్కర్
తైవాన్ సైన్యాధ్యక్షుడు షెన్ యి దుర్మరణం
తైవాన్‌లో జరిగిన సైనిక హెలికాప్టర్ ప్రమాదం కారణంగా తైవాన్ సైన్యాధ్యక్షుడు షెన్ యి-మింగ్(62)తో సహా మరో ఎనిమిది మంది సైనికాధికారులు దుర్మరణం పాలయ్యారు.
మరో ఐదు మంది గాయాల పాలయ్యారు. తైవాన్‌కు ఈశాన్య ప్రాంతంలోని సైనికులను స్వయంగా కలసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు జనవరి 1న సైన్యాధ్యక్షుడితో పాటు మరో 12 మంది అధికారులు హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. ఈ క్రమంలో రాజధాని తైపీకి సమీపంలోని కొండల్లో హెలికాఫ్టర్ అదృశ్యమైంది. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా హెలికాఫ్టర్ కూలిన ప్రదేశాన్ని జనవరి 2న గుర్తించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయాలతో బయటడినట్లు ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెవాన్ సైన్యాధ్యక్షుడు మృతి
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : షెన్ యి-మింగ్(62)
ఎక్కడ : తైపీకి సమీపంలో, తైవాన్