Current Affairs
Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 05/12/2019
న్యూజిలాండ్‌కు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) న్యూజిలాండ్ క్రికెట్‌ను జట్టును ‘క్రిస్టోఫర్ మార్టిన్-జెన్కిన్స్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అవార్డుకు ఎంపిక చేసింది.
కెనడాలోని హామిల్టన్ నగరంలో డిసెంబర్ 3న జరిగిన కార్యక్రమంలో మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ), బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్లు ఉమ్మడిగా స్పిరిట్ అవార్డును కివీస్ జట్టుకు అందజేశారు.
వన్డే ప్రపంచకప్-2019లో కివీస్ రన్నరప్‌గా నిలిచింది. ‘సూపర్ ఓవర్’దాకా ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో సమఉజ్జీగా నిలిచిన న్యూజిలాండ్… బౌండరీల లెక్కల్లో వెనుకబడి ఓడింది. అయితే ఆ టోర్నీలో కేన్ విలియమ్సన్ సేన చూపిన హుందాతనం అందరి మనసుల్ని గెలుచుకుంది. ఫైనల్లో క్షణానికోసారి పైచేయి మారుతున్నా… స్టోక్స్ (ఇంగ్లండ్) బ్యాట్‌ను తాకుతూ ఓవర్ త్రో బౌండరీ వెళ్లినా… అంపైర్ అదనపు పరుగు ఇచ్చినా… కివీస్ ఆటగాళ్లు మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ న్యూజిలాండ్ జట్టును ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అవార్డుకు ఎంపిక చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రిస్టోఫర్ మార్టిన్-జెన్కిన్స్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : న్యూజిలాండ్, జట్టు
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో వెంకయ్య
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఢిల్లీలో డిసెంబర్ 3న నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
దివ్యాంగులకు సమాజంలో తగిన గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వెంకయ్య ఆకాంక్షించారు. వారిపై సానుభూతి చూపడానికి బదులు పోత్సహించాలని, వారిలోని శక్తిని వెలికి తీయాలని కోరారు. దేశ వ్యాప్తంగా వివిధ విభాగాల్లో అవార్డులకు ఎంపికై న దివ్యాంగులకు ఉపరాష్ట్రపతి పురస్కారాలు అందజేశారు.
పురస్కారాలు-వివరాలు
- రోల్ మోడల్ విభాగంలో నారా నాగేశ్వరరావు (సరూర్‌నగర్, రంగారెడ్డి), ఉత్తమ ఉద్యోగి విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన శాస్త్రవేత్త డా.ఐవీ శ్రీనివాసరెడ్డి అవార్డు అందుకున్నారు.
- ఇటీవల పలు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల కోసం బ్రెయిలీ బ్యాలెట్ పేపర్లను రూపొందించిన బేగంపేటలోని దేవ్నర్ ప్రిటింగ్ హౌస్ ఫర్ ద బ్లైండ్ సంస్థకు ఉత్తమ బ్రెయిలీ ప్రెస్ విభాగంలో అవార్డు లభించింది.
- ఆంధ్రప్రదేశ్ నుంచి కాకినాడకు చెందిన ఉమ ఎడ్యుకేషనల్, టెక్నికల్ సోసైటీకి ఉత్తమ సంస్థగా అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎస్పీజీ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
దేశంలోని ప్రముఖులకు రక్షణ కల్పించే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) చట్టానికి చేసిన సవరణకు రాజ్యసభ డిసెంబర్ 3న ఆమోదం తెలిపింది.
ఈ బిల్లును లోక్ సభ నవంబర్ 27నే ఆమోదించింది. ఎస్పీజీ(సవరణ) బిల్లు-2019 ప్రకారం… ఇకపై దేశ ప్రధాని, అధికార నివాసంలో ఉండే కుటుంబ సభ్యులకు మాత్రమే ఎస్పీజీ రక్షణ వ్యవస్థ సేవలు అందుతాయి. బిల్లుపై జరిగిన చర్చలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ… ‘ప్రధానికి కేటాయించిన అధికారిక నివాసంలో ఉండే కుటుంబ సభ్యులకు ఐదేళ్లపాటు ఎస్పీజీ రక్షణ కల్పిస్తాం. అధికారం కోల్పోయిన రోజు నుంచి ఈ సేవలు నిలిపివేస్తారు’ అని వివరించారు.
మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలను విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కూడా రాజ్యసభ ఆమోదించింది. లోక్‌సభ నవంబర్ 27న ఈ బిల్లును ఆమోదించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎస్పీజీ(సవరణ) బిల్లు-2019కు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : రాజ్యసభ