Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 01/12/2019

అంతర్జాతీయం :

¤ ప్రపంచవ్యాప్తంగా 11-17 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో 80 శాతం కంటే ఎక్కువమంది రోజుకు కనీసం గంటసేపు కూడా వ్యాయామం చేయడం లేదని, ఫలితంగా మేధో వికాసంపై ప్రతికూల ప్రభావం పడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం 2016 నాటికి ప్రపంచవ్యాప్తంగా 146 దేశాల్లో ఉన్న పరిస్థితులను వివరించింది. మన దేశంలో 72% మంది బాలురు రోజులో కనీసం గంట కూడా శారీరక శ్రమ చేయట్లేదు. ప్రపంచ సగటు (78%)తో పోలిస్తే ఇది కాస్త మెరుగు.

జాతీయం :

¤  ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి) స్వర్ణోత్సవాలు గోవాలో ముగిశాయి (9 రోజులపాటు జరిగాయి). పార్టికల్స్‌ (ఫ్రెంచ్‌) ఉత్తమ చిత్రంగా గోల్డెన్‌ పీకాక్‌ అవార్డుకు ఎంపికైంది. ఉత్తమ నటుడిగా (సిల్వర్‌ పీకాక్‌ అవార్డు) – సివ్‌జార్జ్‌ (మరిఘెల్లా – పోర్చుగీస్‌), ఉత్తమ నటిగా (సిల్వర్‌ పీకాక్‌ అవార్డు) – ఉషాజాదవ్‌ (మాయ్‌ ఘాట్‌ – మరాఠీ), ఉత్తమ దర్శకుడిగా – లిజో జోస్‌ పెల్లిస్సెరీ (జల్లికట్టు – మలయాళం) అవార్డులు గెలుచుకున్నారు.
¤  చిట్‌ ఫండ్స్‌ సవరణ బిల్లు-2019కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించగా, లోక్‌సభ నవంబరు 20నే అంగీకారం తెలిపింది. దీని ప్రకారం ఖాతాదార్లు బకాయి పడితే అంతవరకు జమైన మొత్తం నుంచి స్వాధీనం చేసుకునే అధికారం యజమానికి ఉంది.
¤  మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా శివసేన- నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)- కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘మహారాష్ట్ర వికాస్‌ ఆఘాడీ’ (ఎంవీయే) ప్రభుత్వం అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే (59 ఏళ్లు) ప్రమాణ స్వీకారం చేశారు. ఠాక్రే 2003 నుంచి పార్టీ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉద్ధవ్‌తోపాటు ఆరుగురు కేబినెట్‌ మంత్రులతో మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ప్రమాణం చేయించారు.

రాష్ట్రీయం :

రాష్ట్రీయం (ఆంధ్రప్రదేశ్‌)

¤ ఆంధ్రప్రదేశ్‌లో 2.03 లక్షల హెక్టార్లలో ఖర్చులేని ప్రకృతిసాగు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. ఇందులో 5.23 లక్షలమంది రైతులు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. దీనికోసం ఏపీ ప్రభుత్వం 2018-19లో రూ.337.22 కోట్లు ఇస్తే రూ.280 కోట్లు ఖర్చయ్యిందని, ఈ ఏడాది రూ.213 కోట్లు ఇచ్చిందని తెలిపారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. 
 » ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద 2019 ఖరీఫ్‌లో రైతుల దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. 2016-17లో 17.76 లక్షలు, 2017-18లో 18.25 లక్షలు, 2018-19లో 22.62 లక్షలు ఉన్న రైతుల దరఖాస్తుల సంఖ్య 2019 ఖరీఫ్‌నాటికి 40.95 లక్షలకు చేరింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ రాజ్యసభలో చెప్పారు.
¤ విజయవాడ సిద్దార్థ వైద్యకళాశాల స్థాయి పెంపునకు స్వాస్థ సురక్షా యోజన (ఎస్‌ఎస్‌వై) కింద రూ.109.12 కోట్లు, అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాల స్థాయి పెంపునకు రూ.120 కోట్లను కేంద్రం విడుదల చేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్‌ చౌబే తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్‌కు రూ.1618 కోట్లకు ఇప్పటివరకు రూ.496.79 కోట్లు, బీబీనగర్‌ ఎయిమ్స్‌కు రూ.1028 కోట్లకు రూ.5 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.
¤ ఉపాధి హామీ పథకం కింద 2018-19లో ఆంధ్రప్రదేశ్‌ రూ.8,311.16 కోట్లు ఖర్చుచేసినట్లు కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. ఆ సంవత్సరం రాష్ట్రానికి విడుదల చేసిన రూ.6,714.58 కోట్లకంటే ఎక్కువ ఖర్చు పెట్టినట్లు చెప్పారు. 
 » ఈ ఖరీఫ్‌లో ధాన్యం సేకరణకు ఆంధ్రప్రదేశ్‌లో 1,122 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, నవంబరు 27 నాటికి 0.01 లక్షల టన్నులు సేకరించినట్లు కేంద్ర ఆహారం, వినియోగ వ్యవహారాలు, ప్రజాపంపిణీశాఖ సహాయమంత్రి దాన్వే రావ్‌సాహెబ్‌ దాదారావ్‌ తెలిపారు. తెలంగాణలో 2,544 కేంద్రాలు ఏర్పాటయ్యాయని, అందులో ఇంతవరకూ ఏమీ కొనలేదని చెప్పారు.
¤ కేంద్రం అమలుచేస్తున్న సార్వత్రిక ఆరోగ్యబీమా పథకం ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఆంధ్రప్రదేశ్‌లో 1.44 కోట్ల కుటుంబాలు ఉన్నట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. లబ్ధిపొందుతున్న అత్యధిక కుటుంబాల్లో తమిళనాడు (1.47 కోట్లు) తర్వాతి స్థానంలో ఏపీ ఉన్నట్లు చెప్పారు.
¤ నిర్భయ ఫండ్‌ కింద హోంశాఖ కోసం ఏపీకి రూ.20.85 కోట్లు ఇవ్వగా, రూ.8.14 కోట్లకు వినియోగ ధ్రువీకరణ పత్రాలు అందించినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో చెప్పారు. మహిళా పోలీసు వాలంటీర్‌ స్కీంకు రూ.5.21 కోట్లు విడుదల చేస్తే రూ.75.82 లక్షలే ఉపయోగించినట్లు తెలిపారు.

రాష్ట్రీయం (తెలంగాణ)

¤ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని ఎలక్టాన్రిక్‌ ఉత్పత్తుల సమూహం (ఈఎంసీ)లో 50 ఎకరాల్లో రూ. 700 కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి చైనాకు చెందిన ప్రముఖ ఎలక్టాన్రిక్స్‌ ఉత్పత్తుల సంస్థ స్కైవర్త్‌ ముందుకొచ్చింది. ఈ పరిశ్రమలో ఎల్‌ఈడీ టీవీలు, లిథియం బ్యాటరీలు, ఏసీలు, వాషింగ్‌ మెషిన్లు తయారు చేస్తారు.
¤ దేశవ్యాప్తంగా 2017లో కొత్తగా నమోదైన హెచ్‌ఐవీ కేసుల్లో అత్యధికం తెలంగాణలోనే ఉన్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే 9,324 కేసులు నమోదయ్యాయి. నవంబరు 28 నాటికి రాష్ట్రంలో 83,102 మంది హెచ్‌ఐవీ బాధితులున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (టీ సాక్స్‌) ప్రకటించింది. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే హైదరాబాద్‌లో ఈ బాధితులు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా టీ సాక్స్‌ ఈ గణాంకాలను వెల్లడించింది.

ఆర్థిక రంగం :

¤ ఫోర్బ్స్‌ రియల్‌ టైం (రోజువారీ) ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అధిపతి ముకేశ్‌ అంబానీ 9వ ర్యాంకులో నిలిచారు. 2019 సంవత్సరానికి ఫోర్బ్స్‌ రూపొందించిన వార్షిక జాబితాలో అంబానీ 13వ ర్యాంకు పొందారు. ముకేశ్‌ నికర సంపద 60 బిలియన్‌ డాలర్లకు (రూ.4,20,000 కోట్లు) చేరింది. ప్రపంచంలోని అత్యంత శ్రీమంతుల సంపదలో రోజువారీ వచ్చే మార్పుల ప్రకారం రియల్‌ టైం జాబితాలో ర్యాంకులు మారుతుంటాయి. ఈ జాబితాలో అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్‌ బెజోస్‌ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన నికర సంపద 113 బిలియన్‌ డాలర్లు. మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (107.4 బిలియన్‌ డాలర్లు), ఎల్‌వీఎంహెచ్‌ సీఈఓ, ఛైర్మన్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్ట్, కుటుంబం (107.2 బిలియన్‌ డాలర్లు) వరుసగా రెండు, మూడు ర్యాంకులు పొందారు.
¤ భారత వృద్ధి రేటు జులై-సెప్టెంబరు 2019లో ఆరేళ్ల కనిష్ఠ స్థాయి అయిన 4.5 శాతానికి చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2018-19) ఇదే మూడు నెలల సమయంలో వృద్ధి 7 శాతంగా నమోదైంది. ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు నాటికే బడ్జెట్‌ అంచనాల్లో 102.4 శాతానికి చేరింది. వ్యయాలు, ఆదాయాలకు అంతరంగా వ్యవహరించే ద్రవ్యలోటు రూ.7,20,445 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలోనూ 2018-19 బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే 103.9 శాతంగా ద్రవ్యలోటు నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోలోటును రూ.7.03 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

¤ భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటాలను మెరుగ్గా గుర్తించే సాధనాన్ని ‘షాలో వాటర్‌ బోయ్‌’ పేరుతో అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది సముద్ర గర్భంలో చిన్నపాటి కదలికలు, మార్పులను సైతం ఇట్టే పసిగట్టేస్తుంది. సముద్ర గర్భాన్ని పర్యవేక్షించడానికి ప్రస్తుతం అనేక విధానాలు అందుబాటులో ఉన్నా ఇతర ధ్వనులు పెద్దగా వినిపించని, తక్కువగా ఉండే సముద్ర లోతుల్లోనే అవి బాగా పనిచేస్తాయి. తీరానికి చేరువలో, లోతు తక్కువగా ఉండే ప్రాంతాల్లో పరిస్థితులను గమనించడం చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. తాజాగా శాస్త్రవేత్తలు రూపొందించిన షాలో వాటర్‌ బోయ్‌లో లంగరు వేసిన ఒక తేలియాడే సాధనం (బోయ్‌) ఉంటుంది. అందులో అత్యంత కచ్చితత్వంతో కూడిన జీపీఎస్‌ వ్యవస్థను అమర్చారు. డిజిటల్‌ కంపాస్‌ను ఉపయోగించి ఈ బోయ్‌ దృక్కోణాన్ని లెక్కిస్తారు. ఈ సాధనం సముద్రగర్భానికి సంబంధించిన త్రీడీ కదలికల డేటాను అందిస్తుంది. దీని విశ్లేషణ ద్వారా పెను సునామీలను కలిగించే భూకంపాల రాకను ముందే తెలుసుకోవచ్చు.
¤ 
వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాలను గణనీయంగా తగ్గించేందుకు ఐఐటీ జోధ్‌పుర్‌ శాస్త్రవేత్తలు రాజస్థాన్‌లోని ఎర్రమట్టిని ఉపయోగిస్తూ ‘క్యాటలైటిక్‌ కన్వర్టర్‌’ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవాటితో పోలిస్తే దీని ధర తక్కువ. సాధారణంగా వాహనాల పొగ గొట్టం ద్వారా బయటకు వచ్చే కాలుష్య కారకాల హాని తీవ్రతను తగ్గించేందుకు ‘క్యాటలైటిక్‌ కన్వర్టర్‌’ను బిగిస్తారు. ఈ పరికరాల్లో ప్రస్తుతం పలాడియం, సీరియం లాంటి ఖరీదైన మూలకాలను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఐటీ జోధ్‌పుర్‌ ప్రొఫెసర్‌ రాకేశ్‌ శర్మ నేతృత్వంలోని బృందం రాజస్థాన్‌ ఎర్రమట్టి నుంచి ఐరన్, నికెల్, కోబాల్ట్‌ నానోకణాలను సేకరించి తయారు చేసిన ‘క్యాటలైటిక్‌ కన్వర్టర్‌’ కాలుష్య కారకాలను తక్కువ ప్రమాదకరమైనవిగా మార్చడంలో విజయవంతంగా పనిచేసింది.
¤ కేరళ ప్రభుత్వ స్టార్టప్‌ మిషన్‌ సంయుక్త భాగస్వామ్యంలో వీఎస్‌టీ మొబిలిటీ సొల్యూషన్స్‌ ‘స్మార్ట్‌ ఎక్లిప్స్‌’ అనే పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఇది వాహన ప్రదేశాన్ని కచ్చితత్వంతో గుర్తించడంతోపాటు డ్రైవర్‌ ప్రవర్తనను పసిగడుతుంది. వాహనం అదుపులో లేదని భావిస్తే ఇంజిన్‌ను ఆపేస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close