Telugu News

Solar Eclipse 2020 : నేడు సూర్యగ్రహణం… ఏం చెయ్యాలి… ఏం చెయ్యకూడదు?

Solar Eclipse 2020 : కరోనా వైరస్ కాలంలో… కాస్త ఊరట కల్పిస్తూ… అంతరిక్షంలో అద్భుతం నేడు (జూన్ 21) ఆవిష్క్రృతం కాబోతోంది. ఇండియాతోపాటూ… ఆసియా దేశాలు, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్రికా, చైనా, ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం కనిపించబోతోంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రజలు దీన్ని చూసేందుకు వీలుంది. డైరెక్టుగా కాకుండా… ప్రత్యేక పరికరాల్ని ఉపయోగించి… దీన్ని చూడొచ్చు. ఈసారి వచ్చే సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటున్నారు. ఇది ఏర్పడే సమయంలో… భూమి, సూర్యుడి మధ్యలో చందమామ అడ్డుగా వస్తుంది. చందమామ పూర్తిగా సూర్యుణ్ని మూసివేసినప్పుడు… నల్లటి చందమామ చుట్టూ… రింగ్ లాంటి ఆకారం ఏర్పడుతుంది. అదే రింగ్ ఆఫ్ ఫైర్ అంటున్నారు. ఉదయం 9.15కి మొదలై… సాయంత్రం 3.04కి ఈ సూర్యగ్రహణం వీడుతుంది.

ఈసారి వచ్చే గ్రహణం మన తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా కనిపించదు. ఉత్తర భారత దేశంలో మాత్రం సంపూర్ణంగా కనిపిస్తుంది. మిధున రాశి వారు ఈ గ్రహణాన్ని చూడవద్దని పండితులు కోరుతున్నారు. అలాగే… ఆరుద్ర, మృగశిర, పునర్వసు నక్షత్రా వారు కూడా దీన్ని చూడకపోవడం మేలంటున్నారు.

తెలంగాణలో :

తెలంగాణలో ఈ గ్రహణం… ఉదయం 10.14కి మొదలవుతుంది. ఉదయం 11.55కి చందమామ… సరిగ్గా భూమి, సూర్యుడి మధ్యకు వస్తుంది. ఆ తర్వాత గ్రహణం వీడిపోతూ… మధ్యాహ్నం 1.44కి పూర్తిగా తొలగిపోతుంది. అంటే మొత్తం 3న్నర గంటలపాటూ గ్రహణం ఉంటుందనుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో :

ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.23కి గ్రహణం మొదలవుతుంది. మధ్యాహ్నం 12.05కి చందమామ… సరిగ్గా భూమి, సూర్యుడి మధ్యకు వస్తుంది. ఆ తర్వాత గ్రహణం వీడిపోతూ… మధ్యహ్నం 1.51కి పూర్తిగా తొలగిపోతుంది. అంటే దాదాపు 3న్నర గంటలపాటూ గ్రహణం ఉంటుందనుకోవచ్చు.

గ్రహణం రోజున ఇలా చెయ్యండి :

జూన్ 21 ఆదివారం నాడు… ఉదయం 8 గంటల లోపు స్నానాలు పూర్తి చేసుకోవాలి. 9.15లోపు టిఫిన్లు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత జపాలు, గాయత్రి మంత్రం చదువుకోవచ్చు. గ్రహణం వీడేటప్పుడు… మధ్యాహ్నం 2 గంటలలోపు ఇల్లంతా కడుక్కొని… మళ్లీ తల స్నానం చెయ్యాలి. తర్వాత పూజలు చేసుకోవచ్చు.

వేసవిలో సూర్యగ్రహణం రోజున పగలు ఎక్కువగా… రాత్రి తక్కువగా ఉంటుంది. గ్రహణం తర్వాత నుంచి… పగటి పూట తగ్గుతూ… రాత్రి పూట పెరుగుతూ ఉంటుంది. ఈసారి ఏకంగా 6 గంటల పాటూ సూర్యగ్రహణం ఉండనుండటం ఆసక్తికర విషయమే.

ఈ సూర్యగ్రహణాన్ని సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్‌తో మాత్రమే చూడాలని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ – నాసా తెలిపింది. దీన్ని మొబైల్‌తో ఫొటోలు కూడా తీయవద్దు. సూర్యగ్రహణాన్ని ఫొటోలు, వీడియోలూ తియ్యాలంటే… స్పెషల్ సోలార్ ఫిల్టర్ అవసరం అని నాసా తెలిపింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close