NewsTech NewsTelugu News
నాసాలో మెరిసిన తెలుగు తేజం.. స్పేస్ కమాండర్‌గా హైదరాబాదీ.
భారత-అమెరికన్ పౌరుడు రాజాచారిని స్పేస్ఎక్స్ క్రూ-3 మిషన్‌కు కమాండర్‌గా ఎంపిక చేశాయి.వచ్చే ఏడాది ఈ మిషన్ అంతరిక్షంలోకి వెళ్లనుంది. 2017లో నాసాలో చేరిన రాజాచారికి ఇది మొదటి అంతరిక్ష యాత్ర.
- స్పేస్ఎక్స్ క్రూ-3 మిషన్‌కు కమాండర్‌గా రాజాచారి
- అమెరికా వాయుసేనలో కల్నల్‌గా పనిచేస్తున్న చారి
- హైదరాబాద్‌తో రామాచారికి ప్రత్యేక అనుబంధం
చిన్నతనం నుంచి చాలామంది చాలా కలలు కంటారు. ఇది అవ్వాలని అది అవ్వాలని అనుకుంటారు. కానీ కొందరు మాత్రమే కన్న కలల్ని నిజం చేసుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ స్పేస్ సెంటర్ నాసా స్పేస్ మిషన్ కమాండర్ రాజా చారి ఒకరు. భారత-అమెరికన్ పౌరుడు రాజాచారిని స్పేస్ఎక్స్ క్రూ-3 మిషన్‌కు కమాండర్‌గా ఎంపిక చేశాయి. ఈ స్పేస్ మిషన్… ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్)కు వెళ్తుంది. రాజా చారి వయసు 43 ఏళ్లు. అమెరికా వాయుసేనలో కల్నల్‌గా పనిచేస్తున్నారు. త్వరలో ఆయన స్పేస్ఎక్స్ క్రూ-3 మిషన్‌కు కమాండర్‌గా వ్యవహరిస్తారు.
వచ్చే ఏడాది ఈ మిషన్ అంతరిక్షంలోకి వెళ్లనుంది. త్వరలో ఈ మిషన్‌లో నాలుగో సభ్యుడు కూడా చేరతారని నాసా సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. “నేను చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా. టామ్ మార్ష్‌బర్న్, మాథ్యూస్ మారర్‌తో కలిసి అంతరిక్ష కేంద్రానికి వెళ్లేందుకు అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నా” అని రాజాచారి ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. రాజాచారికి ఇది మొదటి అంతరిక్ష యాత్ర. ఆయన 2017లో నాసాలో చేరారు.
అప్పటి నుంచి హ్యూస్టన్‌లోని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌లో రెండు సంవత్సరాలపాటు శిక్షణ తీసుకున్నారు. 2017లో నాసాకు చెందిన ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్‌లో పాలుపంచుకున్న 12మంది ట్రైనీల్లో ఆయన కూడా ఒకరు. ఈ టీమ్‌లో ఏడుగురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. 18,300 మంది అభ్యర్థుల నుంచి ఈ 12 మందిని ఎంపిక చేశారు. పైలట్‌గా శిక్షణతోపాటు స్పేస్‌వాక్‌లో కూడా ఆయనకు ట్రైనింగ్ ఇచ్చారు. పైలట్‌గా 2,500 గంటలకు పైగా విమానాలు నడిపిన అనుభవాన్ని రాజాచారి సంపాదించారని నాసా వెల్లడించింది.
ఇటీవలే రాజాచారి ఆర్టెమిస్ టీమ్‌లో సభ్యుడిగా ఎంపికయ్యారని, భవిష్యత్తులో జరిగే మూన్ మిషన్‌లకు కూడా ఆయన అర్హత సాధించారని నాసా తెలిపింది. ఆర్టెమిస్ అంటే మానవసహిత అంతరిక్ష యాత్రా కార్యక్రమం. దీనికి అమెరికా ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. 2024 నాటికి తొలి మహిళను, మరో మనిషిని చంద్రుడిపైకి, ముఖ్యంగా చంద్రుడి ధ్రువ ప్రాంతానికి చేర్చడం ఈ మిషన్ లక్ష్యం. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తరువాత నాసా యాత్రకు వెళ్లే మూడో భారత సంతతి వ్యక్తిగా రాజాచారి రికార్డు సాధించబోతున్నారు. రాజాచారి 2012లో సునీతా విలియమ్స్‌ను కలిశారు.