NewsTelugu News
ఫస్టియర్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం
- జూన్ 1వ తేదీ నుంచే ఫస్టియర్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు
- ఇప్పటికే ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల
- జూలై 5 వరకు మొదటి విడత అడ్మిషన్లు
- సెకండియర్ అడ్మిషన్లపై త్వరలో నిర్ణయం
తెలంగాణలోని టెన్త్ పాసైన విద్యార్థులకు గుడ్‌న్యూస్. తెలంగాణలోని ఇంటర్ కాలేజీల్లో 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఫస్టియర్ ప్రవేశాలకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేసింది. అలాగే.. జూన్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు మొదలవుతాయని పేర్కొంది. ఇక అడ్మిషన్ల ప్రక్రియ మే 25 నుంచి నుంచి ప్రారంభమైంది. జులై 5 వరకు మొదటి దశ అడ్మిషన్లు కొనసాగుతాయని వెల్లడించింది.
జూన్ ఒకటో తేదీ నుంచే ఫస్టియర్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ప్రకటన విడుదలచేశారు. మొదటి విడుత ప్రవేశాల షెడ్యూల్ మాత్రమేనని, పరిస్థితిని బట్టి రెండో విడుత ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఎస్సెస్సీ విద్యార్థుల ఇంటర్నెట్ మెమోల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. అంతకుమించి ఎలాంటి అడ్మిషన్ టెస్టులు నిర్వహించకూడదని తెలిపారు. అలాగే అనుమతికి మించి విద్యార్థులను చేర్చుకోవద్దని సూచించారు. ఎస్‌ఎస్‌సీ ఒరిజినల్ మెమోలు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు సమర్పించిన తర్వాతే ప్రొవిజినల్ అడ్మిషన్లను ఆమోదిస్తామని స్పష్టంచేశారు. అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ నిబంధనలు రూపొందించారు.
టెన్త్ పాసైన విద్యార్థులు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, కో ఆపరేటివ్, తెలంగాణ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ఇంటెన్సివ్, మైనార్టీ గురుకులాలు, కేజీబీవీలు, టీఎస్ మోడల్ జూనియర్ కాలేజీలు, కాంపొజిట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు. విద్యార్థులు ఇతర వివరాల కోసం https://acadtsbie.cgg.gov.in/ లేదాhttps://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు.