Blog
చైనా అంగారక యాత్ర ప్రారంభం: ఒకేసారి మూడు లక్ష్యాలతో ప్రయోగం.. ప్రపంచంలో తొలిసారి!
ఆర్బిటర్ ద్వారా అంగారకుడిపై సమగ్ర పరిశీలన, దాని ఉపరితలంపై ఆర్బిటర్‌తో పరిశోధన, ల్యాండింగ్ ప్రదేశంలోని పరిసరాలను రోవర్ ద్వారా పరిశీలించడమే లక్ష్యంగా డ్రాగన్ ఈ యాత్రను చేపట్టింది. ఫిబ్రవరిలో అంగారుకుడి కక్ష్యలోకి తియాన్వెన్ చేరగానే ఆర్బిటర్ నుంచి ల్యాండర్-రోవర్ విడిపోయి ఉపరితలంపై కాలుమోపుతాయి.
మార్స్ గ్రహ కక్ష్యలోనే ఉండి ఆర్బిటర్ పరిశోధనలు సాగిస్తుంది. ఇక, 200 కిలోల బరువున్న రోవర్ అంగారకుడిపై మూడు నెలల పాటు పనిచేస్తుంది. తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహం వద్దకు ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లను పంపడం ఇదే తొలిసారి అని చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ పేర్కొంది. అమెరికా వంటి దేశాలు తొలుత అనేక ఆర్బిటర్‌లను పంపిన తర్వాతే ల్యాండింగ్‌కు ప్రయత్నించాయని వివరించింది.
అంగారకుడిపై పరిశోధనలకు భారత్ ఇప్పటికే 2014లో మంగళయాన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా దేశంగా భారత్ గుర్తింపు పొంది. ప్రస్తుతం ఈ జాబితాలో చైనా వచ్చి చేరింది. వాస్తవానికి 2011లో రష్యాతో కలిసి యుంగ్‌హువో-1 అనే వ్యోమనౌకను అంగారకుడి వద్దకు చైనా ప్రయోగించింది. అయితే ప్రయోగం చేపట్టిన కొద్దిసేపటికే విఫలమైంది. ఈసారి మాత్రం చైనా సొంతంగా ఈ యాత్రను చేపట్టింది.
మార్స్ ప్రోబ్‌లోని రోవర్ అంగారకుడి దక్షిణాన యుటోపియా ప్లానిషియా అనే ప్రాంతం వద్ద దిగనుంది. ఈ సాప్ట్ లాండింగ్ విజయవంతమయితే, మార్స్ మీద మొదటి ప్రయోగంలోనే ఆర్బిటింగ్, లాండింగ్, రోవర్ మూడు లక్ష్యాలను విజయవంతంగా ప్రయోగించిన తొలి దేశంగా చైనా గుర్తింపు పొందనుంది. ఇంతకు ముందు అంతరిక్ష యాత్రలో తొలిసారే ఏ ప్రయోగమూ మూడు లక్ష్యాలలో విజయవంతం కాలేదు.
అంతర్జాతీయ సహకారంతోనే ఈ మార్స్ ప్రోబ్ యాత్ర విజయవంతమైయ్యిందని చెప్పేందుకు రాకెట్‌పై యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రియన్ రిసెర్చ్ ప్రమోషన్ ఏజెన్సీ లోగోలు ముద్రించారు. అయితే, ఇందులో నాసా లోగో ఉందన్న విషయాన్ని మాత్రం చైనా అధికార పత్రిక తెలియజేయలేదు.
Source link